కష్టమైన ప్రశ్నకు ప్రశాంతమైన సమాధానం

మతం పేరుతో హింస జరిగినప్పుడు చాలామందికి ఒక ప్రశ్న వస్తుంది: మతం వల్లే మనుష్యులు హింసాత్మకంగా మారతారా? ముఖ్యంగా భారతదేశంలో ఈ ప్రశ్న చాలా ముఖ్యం. ఎందుకంటే మతపరమైన గొడవలు ఎంత బాధను కలిగిస్తాయో మనకు తెలుసు.

యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము తన సభ్యులకు శాంతిని నెలకొల్పేవారిగా ఉండాలని, శత్రువులను ప్రేమించాలని, క్షమించాలని బోధిస్తుంది. అయితే మత చరిత్రలో, తమ సంఘ చరిత్రలో కూడా హింస జరిగిన విషయాన్ని సంఘం దాచిపెట్టదు. ఈ రెండు విషయాలను పరిశీలిద్దాం.

హింస గురించి యేసు క్రీస్తు ఏమి బోధించారు?

కడవరి దిన పరిశుద్ధుల విశ్వాసానికి యేసు క్రీస్తే కేంద్రం. కొండమీది ప్రసంగంలో ఆయన ఇలా బోధించారు:

“మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును శపించువారిని దీవించుడి, మిమ్మును ద్వేషించువారికి మేలు చేయుడి, మిమ్మును బాధపరచి హింసించువారి కొరకు ప్రార్థన చేయుడి.”

— మత్తయి 5:44

ఇలా చేయడం సులభం కాదు. ద్వేషానికి మరింత ద్వేషంతో సమాధానం చెప్పకుండా, భిన్నంగా స్పందించాలని ఈ బోధన మనకు చెబుతుంది. యేసు క్రీస్తును అనుసరించేవారు “మనుష్యులతో సమాధానముగా నడుచుకొనవలెను” అని మోరోనై 7:4లో మోర్మన్ గ్రంధం బోధిస్తుంది. సంఘ సభ్యులే దాడులకు గురవుతున్న సమయంలో ప్రభువు వారికి ఇచ్చిన ఒక బయల్పాటులో, “యుద్ధమును విసర్జించి సమాధానమును ప్రకటించుడి” అని ఆజ్ఞాపించారు (సిద్ధాంతములు మరియు నిబంధనలు 98:16). కడవరి దిన పరిశుద్ధులకు, శాంతిని నెలకొల్పడం అనేది అదనంగా చేసే పని కాదు. అది యేసు క్రీస్తును అనుసరించడంలో ఒక భాగం.

మతం వల్లే మనుష్యులు హింసాత్మకంగా మారతారా?

కొన్నిసార్లు ప్రజలు తమ మత విశ్వాసాలను, మతపరమైన అనుబంధాలను అతిగా తీసుకొని, వాటిని హింసకు సమర్థనగా ఉపయోగిస్తారు. అయితే మతం వల్లే మనుష్యులు హింసాత్మకంగా మారతారని సంఘం బోధించదు. గత శతాబ్దంలో జరిగిన అనేక సామూహిక హత్యలకు మతపరమైన విభేదాల కంటే రాజకీయ, జాతి లేదా వర్గాల మధ్య విభేదాలే ప్రధాన కారణమని అధ్యక్షులు డాలిన్ హెచ్. ఓక్స్ పేర్కొన్నారు. తమ మతం పేరుతో వ్యవహరిస్తున్నామని చెప్పుకున్న తీవ్రవాదులను మత నాయకులు గట్టిగా ఖండించారని కూడా ఆయన గుర్తుచేశారు.

ఇది ఎందుకు ముఖ్యమంటే, ఒక వ్యక్తి తన చర్యను సమర్థించుకోవడానికి మతాన్ని ఉపయోగించవచ్చు. కానీ ఆ చర్య ఆ మతం నిజంగా బోధించే విషయాలకు అనుగుణంగా ఉందని దాని అర్థం కాదు.

ఒక కడవరి దిన పరిశుద్ధుడు హింసాత్మక నేరానికి పాల్పడితే?

ఈ విషయంలో సంఘం స్పష్టంగా ఉంది. ఒక సభ్యుడు హింసాత్మక నేరానికి పాల్పడితే, ఆ వ్యక్తి యేసు క్రీస్తు బోధనలకు, ఆయన సంఘ బోధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడు. తీవ్రవాదానికి సమాధానం మరింత ద్వేషం కాదు. శాంతికి అధిపతియైన యేసు క్రీస్తును అనుసరించడమే సరైన మార్గం.

ఎల్డర్ యులిసెస్ సోవారెస్, రక్షకునిలా మారుతున్నామనడానికి ఒక స్పష్టమైన సూచన ఇతరులతో మనం ఎలా వ్యవహరిస్తామనేదే అని బోధించారు. పరిస్థితులు ఎలా ఉన్నా, మనం ఇతరులతో “ప్రేమగా, ఓర్పుతో, దయగా” వ్యవహరించడం ముఖ్యం. మన అభిప్రాయాలు ఇతరులతో భిన్నంగా ఉన్నప్పటికీ ఇది వర్తిస్తుంది.

బైబిలు, మోర్మన్‌ గ్రంధంలో హింస గురించి ఏముంది?

లేఖనాల్లో హింస జరిగిన సంఘటనలు ఉన్నాయి. వాటిలో కొన్ని దేవుని ఆజ్ఞ మేరకు జరిగినట్లుగా కనిపిస్తాయి. దీనివల్ల నిజమైన ప్రశ్నలు తలెత్తుతాయి. అయితే ఈ సంఘటనలను నేటి కాలంలో హింసకు అనుమతిగా సంఘం ఉపయోగించదు.

మోర్మన్‌ గ్రంధంలో నీఫై లాబానును చంపిన సంఘటన ఒక కష్టమైన ఉదాహరణ. సంఘ నాయకులు కూడా ఈ సంఘటనను అర్థం చేసుకోవడం కష్టమని గుర్తిస్తారు. ప్రతి ప్రశ్నకు ఒకే సులభమైన సమాధానం ఉండదు. నీఫై స్వయంగా అలా చేయాలని కోరుకోలేదు; అది దేవుని ఆజ్ఞ అని అతను అర్థం చేసుకున్నాడు. అదే లేఖనాల్లో “నరహత్య చేయకూడదు” అనే ఆజ్ఞ కూడా ఉంది (నిర్గమకాండము 20:13). అందువల్ల, ఇలాంటి సంఘటనలను దేవుని ప్రజలు అనుసరించాల్సిన సాధారణ నియమంగా కాకుండా, అరుదైన ప్రత్యేక సందర్భాలుగా పరిగణిస్తారు.

యుద్ధం, ఆత్మరక్షణ గురించి ఏమిటి?

మోర్మన్‌ గ్రంధంలో ప్రజలు తమ కుటుంబాలను, హక్కులను, దేశాన్ని, మతాన్ని కాపాడుకోవడానికి యుద్ధాలు చేసిన సంఘటనలు ఉన్నాయి. కెప్టెన్ మొరోనై గొప్ప సైనిక నాయకుడు. అయినప్పటికీ, అతను “రక్తపాతమందు ఆనందించలేదు” అని లేఖనం చెబుతోంది (ఆల్మా 48:11).

యేసు క్రీస్తును ప్రేమించిన యాంటీ-నీఫై-లేహీ ప్రజల ఉదాహరణ కూడా ఉంది. వారు ఇకపై ఆయుధాలు పట్టకూడదని నిర్ణయించుకున్నారు. తమను తాము రక్షించుకోవడానికి కూడా ఆయుధాలు ఉపయోగించకూడదని నిశ్చయించుకున్నారు. ప్రతి పరిస్థితికి ఒకే సులభమైన సమాధానాన్ని లేఖనాలు ఇవ్వవు. అయితే ప్రాధాన్యత మాత్రం స్పష్టంగా ఉంది: శాంతి. అధ్యక్షులు రస్సెల్ ఎం. నెల్సన్ ఇలా బోధించారు: “సంఘంగా మనం ‘యుద్ధమును విసర్జించి సమాధానమును ప్రకటించాలి.’” వ్యక్తిగతంగా కూడా శాంతిని నెలకొల్పేవారిగా ఉండాలని ఆయన సభ్యులను ప్రోత్సహించారు.

సంఘ చరిత్రలో జరిగిన హింస గురించి ఏమిటి?

మతం, హింస గురించి నిజాయితీగా మాట్లాడాలంటే, చరిత్రలోని కష్టమైన విషయాలను కూడా పరిశీలించాలి. సంఘ చరిత్రలో హింసకు గురికావడం, సంఘర్షణలు, హింసాత్మక సంఘటనలు ఉన్నాయి. 1830వ దశకంలో మిస్సౌరీలో సంఘ సభ్యులు హింసకు గురైన సంఘటనలు, ఆ తర్వాత జరిగిన ప్రతిఘటన కూడా ఇందులో ఉన్నాయి.

1857లో జరిగిన మౌంటెన్ మెడోస్ ఊచకోత కూడా ఈ చరిత్రలో ఒక భాగం. ఈ సంఘటనలో కడవరి దిన పరిశుద్ధుల సైనిక దళానికి చెందిన కొందరు సభ్యులు, కొంతమంది స్థానిక అమెరికన్లతో కలిసి, వలస వెళ్తున్న సుమారు 120 మందిని చంపారు.

ఈ సంఘటన గురించి ఎల్డర్ హెన్రీ బి. ఐరింగ్ ఇలా అన్నారు:

“ఇది క్రైస్తవ బోధనలకు, ప్రవర్తనకు పూర్తిగా విరుద్ధమైన భయంకరమైన, క్షమించరాని చర్య.”

— ఎల్డర్ హెన్రీ బి. ఐరింగ్

ఈ సంఘటనను నిజమైన క్రైస్తవ విశ్వాసానికి ఉదాహరణగా సంఘం చూపించదు. జరిగిన తప్పును అది అంగీకరిస్తుంది.

“రక్త ప్రాయశ్చిత్తం” సంఘ బోధనా?

ప్రారంభ కాలంలోని కొంతమంది సంఘ నాయకులు తమ ప్రసంగాల్లో “రక్త ప్రాయశ్చిత్తం” అనే పదాన్ని ఉపయోగించారు. అయితే సంఘం స్పష్టంగా చెబుతోంది: “రక్త ప్రాయశ్చిత్తం” అనేది యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క సిద్ధాంతం కాదు. యేసు క్రీస్తు చేసిన ప్రాయశ్చిత్త త్యాగం ద్వారానే విమోచనం లభిస్తుందని సంఘం బోధిస్తుంది. ఒక నిర్దిష్ట కాలంలో, ఒక నిర్దిష్ట సందర్భంలో ఒక నాయకుడు చెప్పిన ప్రతి మాట సంఘ అధికారిక సిద్ధాంతం అయిపోదు.

కడవరి దిన పరిశుద్ధుల దృక్పథం ఏమిటి?

మతానికి సంబంధించిన చరిత్రలో హింస చోటుచేసుకుంది. ప్రజలు తమ విశ్వాసాలను దుర్వినియోగం చేయవచ్చు. కొందరు తమ మతం బోధనలకు విరుద్ధంగా ప్రవర్తించవచ్చు. అయినప్పటికీ, యేసు క్రీస్తు ఇచ్చిన బోధన స్పష్టంగా ఉంది:

  • మీ శత్రువులను ప్రేమించండి.
  • మీకు హాని చేసేవారికి మేలు చేయండి.
  • శాంతిని కోరుకోండి.
  • కోపం, ద్వేషం మీ ప్రవర్తనను నియంత్రించనివ్వకండి.

మత చరిత్రలో హింస కనిపించవచ్చు. కానీ యేసు క్రీస్తు బోధించిన ఆదర్శం హింస కాదు. కడవరి దిన పరిశుద్ధులకు, యేసు క్రీస్తును అనుసరించడం అంటే కష్టమైనప్పటికీ శాంతిని నెలకొల్పేవారిగా మారడం.

కొన్నిసార్లు సంఘర్షణకు బలమైన సమాధానం పోరాటంలో గెలవడం కాదు. ఆ పోరాటంలో మనం కూడా భాగం కాకూడదని నిర్ణయించుకోవడమే.

మీకు ఇవి కూడా ఆసక్తికరంగా ఉండవచ్చు: