జనరల్ కాన్ఫరెన్స్ సమయం దగ్గరపడుతున్నప్పుడు, మన వ్యక్తిగత ప్రశ్నలకు సమాధానాలు పొందడానికి, సమస్యల్లో బలాన్ని పొందడానికి మరియు జీవితానికి సరైన దారి తెలుసుకోవడానికి మనకు ఒక గొప్ప అవకాశం లభిస్తుంది. దేవుని ప్రవక్తలు మరియు సేవకుల ద్వారా లభించే ఈ “ఆధ్యాత్మిక విందును” పూర్తిగా ఆస్వాదించడానికి ఈ 5 సూచనలు పాటించండి:

1. ప్రార్థనతో సిద్ధపడండి

కాన్ఫరెన్స్‌కు కొన్ని రోజుల ముందు నుండే దాని ప్రాముఖ్యత గురించి ఆలోచించండి. మీకు కావలసిన సమాధానాలు దేవుని సేవకుల ద్వారా రావాలని ప్రార్థించండి. ప్రెసిడెంట్ ఉఖ్‌డార్ఫ్ చెప్పినట్లు, మీ ప్రార్థనలకు సమాధానాలు ఒక ప్రసంగం ద్వారా లేదా ఒక చిన్న మాట ద్వారా, చివరికి ఒక పాట ద్వారా కూడా రావచ్చు. ఇది “ఆత్మతో ఆత్మ మాట్లాడడం” వంటిది. పరిశుద్ధాత్మ మన మనసును వెలిగించి, ఒంటరితనంలో మరియు కష్టాల్లో మనకు తోడుగా ఉంటుంది.

(సంబందించిన ప్రసంగం ఇక్కడ చూడండి: “General Conference — No Ordinary Blessing,” Dieter F. Uchtdorf, Ensign, Sept. 2011)

2. త్వరగా నిద్రపోండి (సమావేశం మధ్యలో కాదు!)

సిద్ధాంతము మరియు నిబంధనలు 88:124 “త్వరగా నిద్రపోండి, త్వరగా లేవండి, తద్వారా మీ శరీరం మరియు మనసు తాజాగా ఉంటాయి” అని లేఖనాలు చెబుతున్నాయి. ముందురోజు రాత్రి మంచి నిద్రపోతేనే మీరు సమావేశంలో మెలకువగా ఉండి, చెప్పే విషయాలను గ్రహించగలరు. నీరసం రాకుండా ఉండటానికి మీ దగ్గర ఒక వాటర్ బాటిల్ ఉంచుకోండి, ఎందుకంటే శరీరంలో నీటి శాతం తగ్గితే అలసటగా అనిపిస్తుంది.

3. పనులన్నీ ముందే పూర్తి చేసుకోండి

మీరు కాన్ఫరెన్స్ వింటున్నప్పుడు వంట గురించి, ఇంటి పనులు లేదా పరీక్షల గురించి ఆలోచిస్తుంటే.. దేవుడు ఇచ్చే సందేశాన్ని సరిగ్గా వినలేరు. కాబట్టి మీ పనులన్నీ ముందే ప్లాన్ చేసుకుని పూర్తి చేయండి. మీ ఆందోళనలను పక్కన పెట్టి, కేవలం మీ ప్రశ్నలతో మరియు దేవుని మాట వినాలనే కోరికతో మాత్రమే సమావేశానికి రండి.

4. మీ ఫోన్‌ను ఆఫ్ చేయండి!

పరిశుద్ధాత్మ స్వరం చాలా మెల్లగా, నిశ్శబ్దంగా వినిపిస్తుంది.ఫోన్ రింగ్ టోన్స్ లేదా మెసేజ్ నోటిఫికేషన్లు ఆ అనుభూతిని పాడుచేస్తాయి. ఫోన్‌ను పూర్తిగా ఆఫ్ చేయండి లేదా సైలెంట్‌లో పెట్టండి. దేవుడు మీకు ఇచ్చే సందేశం కంటే ముఖ్యమైన ఫోన్ కాల్ ఏదీ ఉండదు. సమావేశం జరుగుతున్నప్పుడు ఫోన్ వాడటం, మెసేజ్‌లు పంపడం లేదా సోషల్ మీడియా చూడటం వల్ల మీరు దేవునితో సంబంధాన్ని  కోల్పోయే అవకాశం ఉంది.

5. నేర్చుకున్న విషయాలను, కలిగిన భావాలను రాసుకోండి

మనం కంటితో చూసే విషయాలు కాలక్రమేణా మర్చిపోవచ్చు, కానీ పరిశుద్ధాత్మ ద్వారా కలిగే భావాలు మన హృదయంలో గాఢంగా నిలిచిపోతాయి. ప్రెసిడెంట్ జోసెఫ్ ఎఫ్. స్మిత్ చెప్పినట్లు, ఆత్మ ద్వారా కలిగే అనుభూతిని అంత సులభంగా చెరిపివేయలేము. అందుకే కాన్ఫరెన్స్ సమయంలో మీకు కలిగిన ఆలోచనలను, భావాలను ఒక డైరీలో రాసుకోండి. తర్వాత వాటిని చదువుకున్నప్పుడు ఆ ఆధ్యాత్మిక అనుభవం మళ్ళీ మీకు గుర్తొస్తుంది.

(Answers to Gospel Questions, Joseph Fielding Smith, 2:151)

ముగింపు: ఈ వారం చివరలో జరగబోయే ఈ ప్రత్యేక అనుభవంలో పాల్గొనడానికి మీ కుటుంబ సభ్యులను, స్నేహితులను ఆహ్వానించండి. ఎల్డర్ హాలండ్ చెప్పినట్లు, “మనం ఆత్మ ద్వారా వింటే, ఎవరో ఒకరు మీ పరిస్థితిని తాకేలా మాట్లాడతారు, అది దేవుడు నేరుగా మీ కోసం పంపిన వ్యక్తిగత సందేశం అవుతుంది.”

(ఈ ప్రసంగం ఇక్కడ చూడండి: “An Ensign to the Nations,” Jeffrey R. Holland, April 2011 General Conference)