5 నిమిషాలు చదవండి 

నీరు మనం జీవించడానికి అవసరమైన వాటిలో ఒకటి. నీరు లేకుండా ఏ జీవి ఎక్కువకాలం జీవించలేదు. మనం ప్రతిరోజూ నీటి గురించి ఆలోచిస్తాం, కానీ అది మనకు ఎప్పుడూ అందుబాటులో ఉండటం వల్ల దాని విలువను చాలాసార్లు పట్టించుకోము.

రక్షకుడైన యేసు క్రీస్తుకు ఇది తెలుసు. సమరయలోని ఒక బావి దగ్గర మధ్యాహ్నం వేళ, అందరికీ తెలిసిన నీటి అవసరాన్ని ఉపయోగించి ఒక స్త్రీకి—అలాగే మనందరికీ—మరింత లోతైన విషయాన్ని బోధించారు: నీరు మనకు ఎంత అవసరం ఉందో, దానికంటే యేసు క్రీస్తు మనకు ఆధ్యాత్మికంగా మరింత అవసరం.

“నేను ఇచ్చే నీటిని త్రాగువాడు ఎన్నటికిని దప్పిగొనడు; నేను ఇచ్చే నీరు అతనిలో నిత్యజీవమునకు ఊరే నీటి బుగ్గగా ఉంటుంది.”
— యోహాను 4:14

1. ఆయన సమరయ గుండా వెళ్లవలసి వచ్చింది

యూదయ నుండి గలిలయకు ప్రయాణిస్తున్నప్పుడు యేసు క్రీస్తు సమరయ గుండా వెళ్లారు. ఈ విషయం చాలా ముఖ్యమైనది. రక్షకుని కాలంలో, ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణించే యూదులు సాధారణంగా సమరయ గుండా వెళ్లకుండా, మరో పొడవైన మార్గంలో వెళ్లేవారు. ఎందుకంటే యూదులకు, సమరయులకు మధ్య చాలా కాలంగా తీవ్రమైన విభేదాలు ఉండేవి. సమరయులు ఇశ్రాయేలీయుల మత విశ్వాసాల నుండి దూరమవడం వల్ల ఈ విభేదాలు మరింత పెరిగాయి. 

అయినప్పటికీ, యోహాను ఇలా రాశారు: యేసు “సమరయ గుండా వెళ్లవలసి వచ్చింది” (యోహాను 4:4). ఇది యాదృచ్ఛికంగా జరిగిన విషయం కాదు. ఆయన ఉద్దేశపూర్వకంగా ఆ మార్గాన్ని ఎంచుకున్నారు. అక్కడ ఆయన చేయబోయే కార్యం ఎంత ముఖ్యమైనదో ఇది చూపిస్తుంది.

ప్రయాణం వల్ల అలసిపోయి, దాహంతో ఉన్న యేసు క్రీస్తు మధ్యాహ్నపు వేళలో ఒక బావి దగ్గర కూర్చున్నారు. ఆయన అక్కడ విశ్రాంతి తీసుకుంటుండగా, ఒక సమరయ స్త్రీ నీరు తీసుకోవడానికి బావి దగ్గరకు వచ్చింది. ఆ తర్వాత జరిగిన సంఘటన ఆమె జీవితాన్ని మార్చివేసింది.

“యేసు సమరయకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఆయన కాలంలోని యూదులు సమరయులను తక్కువగా చూసేవారు, కాబట్టి సమరయను దాటకుండా వేరే మార్గంలో వెళ్లేవారు. కానీ వాగ్దానం చేయబడిన మెస్సీయ తానే అని మొదటిసారిగా ప్రపంచమంతటికీ ప్రకటించడానికి యేసు అక్కడికి వెళ్లాలని ఎంచుకున్నారు.”
— ఎల్డర్ రాబర్ట్ సి. గే, “Taking upon Ourselves the Name of Jesus Christ,” అక్టోబర్ 2018 సర్వసభ్య సమావేశం

2. బావి దగ్గర జరిగిన సంఘటన 

సమరయ స్త్రీ బావి దగ్గరకు వచ్చినప్పుడు, తనతో మాట్లాడతారని ఆమె అసలు ఊహించని ఒక వ్యక్తిని అక్కడ కలిసింది—ఆయన ఒక యూదుడు. ఆమె సమరయ స్త్రీ మాత్రమే కాదు, పాపంలో జీవిస్తున్న స్త్రీగా కూడా ఆ కాలంలో తక్కువగా చూడబడేది. అయినా రక్షకుడైన యేసు క్రీస్తు ఆమెతో మాట్లాడారు. 

ఆయన ఆమెకు బాగా తెలిసిన విషయం—నీటితోనే మాట్లాడటం ప్రారంభించారు. ఆమె శారీరక దాహం తీర్చుకోవడానికి నీరు తీసుకోవడానికి వచ్చింది. కానీ ఆయన ఆమెకు అంతకంటే ఎంతో గొప్పదాన్ని—జీవజలాన్ని—ఇచ్చారు.

“అందుకు యేసు—నీవు దేవుని వరమును, నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగియుంటే, నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలము ఇచ్చునని ఆమెతో చెప్పెను.”
— యోహాను 4:10

జీవజలం యేసు క్రీస్తును మరియు ఆయన సువార్తను సూచిస్తుంది. అది కేవలం దాహాన్ని తీర్చే నీరు కాదు—అది “నిత్యజీవమునకు ఊరే నీటి బుగ్గగా మారుతుంది (యోహాను 4:14). రక్షకుడు ఆ స్త్రీకి కేవలం నీటిని ఇవ్వడం గురించి మాట్లాడలేదు. ఆయన ఆమెకు నిత్యజీవాన్ని ఇచ్చే మార్గాన్ని చూపించారు.

3. ఆయనకు ఆమె జీవితం మొత్తం తెలుసు—అయినా ఆమెను ప్రేమించారు 

వారి సంభాషణ కొనసాగుతున్నప్పుడు ఒక అద్భుతమైన విషయం జరిగింది. యేసు క్రీస్తుకు ఆమె గురించి తెలుసని ఆమె గ్రహించింది. ఆమె పేరు మాత్రమే కాదు, ఆమె జీవితంలోని విషయాలు కూడా ఆయనకు తెలుసు. ఆమె చేసిన పాపాలు, గతం, ఆమె జీవితంలోని నిజాలన్నీ ఆయనకు తెలుసు (యోహాను 4:15–26 చూడండి).

అయినా వాటి కారణంగా ఆయన ఆమెను తక్కువగా చూడలేదు. సెమినరీ టీచర్ మాన్యువల్ కూడా ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతుంది: రక్షకుడికి ఆ స్త్రీ పాపాలు తెలుసు, అయినప్పటికీ ఆయన ఆమెను ఖండించలేదు. దేవుని ఆరాధన గురించి కూడా ఆయన ఆమెకు బోధించారు—మన జాతి లేదా సంస్కృతి ఏదైనా, ఆత్మతో మరియు సత్యంతో దేవుణ్ణి ఆరాధించే వారందరినీ ఆయన అంగీకరిస్తారు.

“క్రీస్తుకు ఆ స్త్రీ గురించి, ఆమె అవసరాల గురించి తెలుసు. ఆమె ఉన్న పరిస్థితిని అర్థం చేసుకుని, ఆమెకు తెలిసిన, సాధారణమైన విషయంతో తన మాటలను ప్రారంభించారు.”
—సిస్టర్ బోనీ హెచ్. కార్డన్, “That They May See,” ఏప్రిల్ 2020 సర్వసభ్య సమావేశం

“మన భయాలు, మన గాయాలు, మన వ్యసనాలు, మన సందేహాలు, మన శోధనలు, మన పాపాలు, మన విరిగిపోయిన కుటుంబాలు, మన నిరాశ, ఆందోళనలు, దీర్ఘకాలిక అనారోగ్యం, పేదరికం, మనపై జరిగిన దుర్వినియోగం, మన నిరాశ మరియు ఒంటరితనం—వీటన్నింటికంటే ఆయన ప్రేమ గొప్పదని మనలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని యేసు ఇలా చేశారని నేను నమ్ముతున్నాను. ఆయన ఎవరినీ వదిలిపెట్టరు. “ ఆయన స్వస్థపరచలేనంత పెద్ద సమస్య ఏదీ లేదు.”
— ఎల్డర్ రాబర్ట్ సి. గే,

4. మారిపోయిన ఒక స్త్రీ—“రండి, చూడండి”

ఆ రోజు బావి దగ్గరకు వచ్చిన స్త్రీ తన గతం వల్ల బాధపడుతూ, జాగ్రత్తగా, అనుమానంతో ఉంది. వారి సంభాషణ ప్రారంభంలో ఆమె యేసు క్రీస్తును ఎలా పిలిచిందో గమనించండి—మొదట “యూదుడు,” తర్వాత “అయ్యా,” ఆ తర్వాత “ప్రవక్త” అని పిలిచింది. కానీ యేసు క్రీస్తు తానే మెస్సీయ అని చెప్పిన తర్వాత, అంతా మారిపోయింది.

ఆమె తన నీటి కుండను అక్కడే వదిలిపెట్టి పట్టణానికి తిరిగి పరిగెత్తుకునిపోయి. తాను కలిసిన ప్రతి ఒక్కరితో ఇలా చెప్పింది:

“మీరు వచ్చి, నేను చేసిన వన్నియు నాతో చెప్పిన మనుష్యుని చూడుడి; ఈయన క్రీస్తుకాడా అని ఆ ఊరివారితో చెప్పగా?”.
— యోహాను 4:29

ఆమె సాక్ష్యం విని పట్టణంలోని అనేకమంది సమరయులు విశ్వసించారు.

“వారి సంభాషణ కొనసాగుతున్న కొద్దీ, ఆమె యేసు క్రీస్తును తెలుసుకుంది. ఆమెకు  గతం ఉన్నప్పటికీ, ఇతరులు ఆయనను చూడడానికి మార్గం చూపించే వెలుగుగా ఆమె మారింది.”
— సిస్టర్ బోనీ హెచ్. కార్డన్

5. ఈ కథ మనకు ఏమి చెబుతోంది?

బావి దగ్గర ఉన్న ఆ స్త్రీ కథ కేవలం గతంలో జరిగిన ఒక సంఘటన కాదు. అది మనలో ప్రతి ఒక్కరికీ ఇచ్చిన సందేశం. సెమినరీ టీచర్ మాన్యువల్ మనల్ని ఒక ప్రశ్న అడగమని ఆహ్వానిస్తుంది: మన జీవితంలో నీరు ఎంత అవసరమో, అంతకంటే ఎక్కువగా యేసు క్రీస్తు మనకు అవసరమని మనం భావిస్తున్నామా?

బావి దగ్గర ఉన్న ఆ స్త్రీలాగే, మనమందరం కూడా కొన్ని విషయాలను మోస్తున్నాం—సందేహాలు, తప్పులు, భారాలు, గాయాలు. అయితే వీటిలో ఏ ఒక్క కారణంగా కూడా మనం ఆయన ప్రేమకు దూరం కాలేము. ఆయన ఆమె కోసం సమరయ గుండా వెళ్లారు. మనం ఎక్కడ ఉన్నా, ఆయన మన దగ్గరకు కూడా వస్తారు.

“బావి దగ్గర ఉన్న స్త్రీ కథ మన జీవిత పరిస్థితులు ఆయనకు తెలుసని, మనం ఎక్కడ ఉన్నా ఎల్లప్పుడూ ఆయనతో కలిసి నడవగలమని చెబుతుంది.”
— ఎల్డర్ రాబర్ట్ సి. గే

రక్షకుడు తన శిష్యులతో చెప్పినట్లుగా, మన చుట్టూ ఉన్న పొలాలు “కోతకు తెల్లగా ఉన్నాయి” (యోహాను 4:35). సిగ్గుతో బావి దగ్గరకు వచ్చిన ఆ స్త్రీ ఒక సాక్షిగా అక్కడి నుండి వెళ్లింది. మనం నిజంగా జీవజలమైన యేసు క్రీస్తును ప్రేమను అనుభవించినప్పుడు, దాని గురించి ఇతరులతో పంచుకోవాలనుకుంటాం.

ముగింపు: ఆయన కృప సరిపోతుంది

రక్షకుడు ఒక సమరయ స్త్రీతో మాట్లాడాలని ఎంచుకున్నారు. ఆ కాలంలో సమాజం తక్కువగా చూసే ఒక స్త్రీ, పాపాలతో జీవిస్తున్న ఒక వ్యక్తి ఆమె. ఎవరూ ఊహించని వ్యక్తి ద్వారా, ఎవరూ ఊహించని ప్రదేశంలో, తానే వాగ్దానం చేయబడిన మెస్సీయ అని రక్షకుడు మొదటిసారిగా ప్రకటించారు. ఇది యాదృచ్ఛికంగా జరిగిన విషయం కాదు. తమను తాము అర్హులు కాదని భావించే వారికి, ఎవరూ తమను పట్టించుకోవడం లేదని అనుకునేవారికి, తమ జీవితంలో ఇక మార్పు రాదని భావించేవారికి ఇది ఒక గొప్ప సందేశం. 

ఆయన కృప మనకు సరిపోతుంది. ఆయన ప్రాయశ్చిత్తానికి మన జీవితంలోని ఏ భారాన్నైనా అధిగమించే శక్తి ఉంది. యేసు క్రీస్తు సువార్త అనే జీవజలం, గతంలో మనం ఎలా ఉన్నా, ఆయన దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంది.

“ఆయన మాత్రమే అన్నిటికంటే దిగువకు దిగివచ్చారు. మన జీవితంలోని ఏ భారాన్నైనా అధిగమించే శక్తి ఆయన ప్రాయశ్చిత్తంలో ఉంది.”
— ఎల్డర్ రాబర్ట్ సి. గే

మీకు ఇవి కూడా ఆసక్తికరంగా ఉండవచ్చు:

సంబంధించిన వీడియో