4 నిమిషాలు చదవండి  

ఆయన జన్మించడానికి చాలా కాలం ముందే దేవుడు ఒక రక్షకుని వాగ్దానం చేశారు

యేసుక్రీస్తు బేత్లెహేములో జన్మించినప్పుడు, అది ఒక అనుకోని ఆశ్చర్యం ఏమీ కాదు. ఆయన జననము గురించి దేవుడు శతాబ్దాల ముందే వాగ్దానం చేశారు.

పాత నిబంధన మరియు మోర్మాన్ గ్రంథం అంతటా, రక్షకుడు లోకములోకి వస్తారని ప్రవక్తలు సాక్ష్యమిచ్చారు. ఆయన తల్లి ఎవరో, ఆయన ఎక్కడ జన్మిస్తారో మరియు ఆయన జననంతో పాటు కనిపించే సూచనల గురించి కూడా వారు మాట్లాడారు. ఈ ప్రవక్తలు వేర్వేరు ప్రదేశాలలో మరియు వేర్వేరు కాలాల్లో జీవించినప్పటికీ, వారి వర్తమానం ఒకటే: లోకాన్ని విమోచించడానికి దేవుడు తన కుమారుడిని పంపుతారు.

సమయం వచ్చినప్పుడు, ఆ ప్రవచనాల్లోని ప్రతీ ఒక్కటి నెరవేరింది — పరలోక తండ్రి ఎల్లప్పుడూ తన వాగ్దానాలను నిలబెట్టుకుంటారని ఇది చూపిస్తోంది.

యేషయా రక్షకుని  జననాన్ని ముందుగానే చెప్పారు

యేసుక్రీస్తు జననానికి 700 సంవత్సరాల కంటే ముందే, ప్రవక్తయైన యెషయా ఇలా ప్రకటించారు:

“ఇదిగో, ఒక కన్యక గర్భవతియై కుమారుని కని ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టును.”

జన్మించబోయే ఆ శిశువు గురించి కూడా యెషయా వర్ణించారు:

“ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను”

ఆయన ఆ శిశువును ఆశ్చర్యకరుడు, ఆలోచన కర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని పిలిచారు. ఈ బిరుదులు వాగ్దానం చేయబడిన ఆ శిశువు సాధారణమైన బాలుని కంటే ఎంతో మిన్నయైనవారని వెల్లడించాయి. ఆయన దేవుని కుమారుడు మరియు లోక రక్షకుడు.

శతాబ్దాల తరువాత, దేవదూతయైన గబ్రియేలు మరియ అనే యువతికి కనిపించి, ఆమె యేసుక్రీస్తుకు జన్మనిస్తుందని చెప్పారు. మత్తయి ఇది యెషయా ప్రవచనాన్ని నెరవేర్చిందని ప్రత్యేకంగా వివరించారు (మత్తయి 1:18–23 చూడండి).

రక్షకుడు ఎక్కడ జన్మిస్తారో మీకా వెల్లడించారు

మరొక ప్రవక్తయైన మీకా, మెస్సయ్య  ఎక్కడ జన్మిస్తారో ఆ ఖచ్చితమైన ప్రదేశాన్ని ముందుగానే చెప్పారు.

ఇశ్రాయేలును పరిపాలించబోయే వాగ్దాన పుత్రుడు బేత్లెహేము నుండి వస్తారని ఆయన ప్రకటించారు (మీకా 5:2 చూడండి).

తరువాత హేరోదు రాజు మెస్సయ్య  ఎక్కడ జన్మిస్తారని ప్రధాన యాజకులను, శాస్త్రులను అడిగినప్పుడు, వారు మీకా ప్రవచనాన్ని ఎరిగి ఉన్నారు కాబట్టి వెంటనే “బేత్లెహేము” అని సమాధానమిచ్చారు (మత్తయి 2:4–6 చూడండి).

యోసేపు మరియు మరియ బేత్లెహేముకు ప్రయాణమైనప్పుడు, ప్రవక్త ముందుగా చెప్పినట్లుగానే యేసు సరిగ్గా అక్కడ జన్మించారు (లూకా 2:4–7 చూడండి).

మోర్మాన్ గ్రంథపు ప్రవక్తలు కూడా క్రీస్తును గూర్చి సాక్ష్యమిచ్చారు

యేసుక్రీస్తు యొక్క సాక్ష్యం కేవలం యెరూషలేములోని ప్రవక్తలకే పరిమితం కాలేదు.

రక్షకుని జననానికి శతాబ్దాల ముందే, ప్రవక్తయైన నీఫై దేవుని కుమారునికి తల్లి కాబోయే ఒక అందమైన కన్యక యొక్క దర్శనాన్ని చూశారు (1 నీఫై 11:18–21 చూడండి).

తరువాత, ప్రవక్తయైన ఆల్మా కూడా యేసుక్రీస్తు మరియకు జన్మిస్తారని సాక్ష్యమిచ్చారు (ఆల్మా 7:9–10 చూడండి). ఈ సంఘటన జరగడానికి అనేక సంవత్సరాల ముందే ఈ ప్రవచనాలు ఇవ్వబడ్డాయి, దేవుడు ప్రపంచంలోని ఇరువైపులా ఉన్న ప్రవక్తలకు తన ప్రణాళికను వెల్లడించారని ఇది చూపిస్తుంది.

వారి సాక్ష్యాలు మనకు ఒక విషయాన్ని గుర్తు చేస్తాయి: తన కుమారుడైన యేసుక్రీస్తు రాక కోసం పరలోక తండ్రి అన్ని చోట్ల ఉన్న ప్రజలను సిద్ధం చేశారు. 

లెమానీయుడైన సమూయేలు క్రీస్తు జనన సూచనలను ప్రవచించారు

యేసు జన్మించడానికి కొన్ని సంవత్సరాల ముందు, ప్రవక్త లమానీయుడైన సమూయేలు రక్షకుని జననాన్ని అద్భుతమైన సూచనలు ప్రకటిస్తాయని చెప్పారు.

ఒక నూతన నక్షత్రం, చీకటి లేని రాత్రి మరియు ఆకాశంలో అనేక ఇతర సూచనలు ఉంటాయని ఆయన ప్రవచించారు (హీలమన్ 14:1–6 చూడండి).

చాలామంది ఆయన మాటలను అనుమానించారు మరియు ఆ ప్రవచనాన్ని నమ్మినవారిని చంపడానికి కూడా పథకం వేశారు. నిర్ణయించబడిన రోజు సమీపిస్తుండగా, నమ్మకమైనవారు విడుదల కొరకు ప్రార్థించారు.

తన వాగ్దానం నెరవేరుతుందని ప్రభువు ప్రవక్తయైన నీఫైకి హామీ ఇచ్చారు.

సమూయేలు ముందుగా చెప్పినట్లే, ఆ రాత్రి చీకటి లేదు మరియు ఒక నూతన నక్షత్రం కనిపించింది (3 నీఫై 1:15–21 చూడండి). అదే సమయంలో, ఇశ్రాయేలు దేశంలోని జ్ఞానులు కూడా ఆ నూతన నక్షత్రాన్ని మెస్సయ్య జననానికి సూచనగా గుర్తించారు (మత్తయి 2:2 చూడండి).

ప్రతి వివరమూ దేవుడు వాగ్దానం చేసినట్లుగానే సరిగ్గా జరిగింది.

ఈ ప్రవచనాలు నేడు మనకు ఏమి బోధిస్తున్నాయి?

క్రీస్తు జననము యొక్క ప్రవచనాలు దేవుడు ఎల్లప్పుడూ తన మాటను నెరవేరుస్తారని మనకు బోధిస్తున్నాయి.

ఈ వాగ్దానాలలో కొన్ని మొదట ఇవ్వబడిన వందల సంవత్సరాల తరువాత నెరవేరాయి. వాటిని పొందిన ప్రవక్తలు వాటి నెరవేర్పును చూడటానికి జీవించలేదు, అయినప్పటికీ దేవుడు తన వాగ్దానాలను నిలబెట్టుకుంటారని వారు నమ్మారు.

వారి విశ్వాసం వ్యర్థం కాలేదు.

ప్రవక్తలు ముందుగా చెప్పినట్లుగానే యేసుక్రీస్తు జన్మించారు. ఆయన జననం పరలోక తండ్రి తన పనిని సరైన సమయంలో నడిపిస్తారని చూపిస్తుంది. 

ఆ పూర్వకాలపు ప్రవచనాలను నెరవేర్చిన దేవుడే నేడు కూడా తన వాగ్దానాలను నిలబెట్టుకుంటున్నారు. మనం ప్రవక్తల మాటలను అధ్యయనం చేస్తూ, యేసుక్రీస్తు నందు మన నమ్మకాన్ని ఉంచినప్పుడు, దేవుడు చేసిన ప్రతి వాగ్దానం కూడా మన జీవితాల్లో — ఆయన జ్ఞానము మరియు సమయము ప్రకారం నెరవేరుతుందనే నమ్మకాన్ని మనం కలిగి ఉండవచ్చు.

మీకు ఇవి కూడా ఆసక్తికరంగా ఉండవచ్చు:

సంబంధించిన వీడియో